భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న తొలిముద్ద కార్యక్రమాన్ని మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లిలో బుధవారం ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ డాక్టర్ చిర్ర యాకాంతం గౌడ్ స్థానిక అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు స్వయంగా కిచిడి వడ్డించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న 3 నుంచి 6 సంవత్సరాల లోపు ప్రీ స్కూల్ చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన ఉదయపు అల్పాహారం అందించడమే తొలిముద్ద కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. చిన్న వయసులోనే పిల్లలకు సరైన పోషకాహారం అందించడం వల్ల వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు పిల్లల హాజరు శాతాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని చిన్నారులందరూ సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లు కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందేలా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పెరుమాండ్ల శ్రీజ్యోతి, మాదగాని కవిత, దాసరి కవిత, ఆయాలు, చిన్నారులు, వారి తల్లులు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.