భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

ప్రతి కుటుంబానికి ₹5 లక్షల బీమా భరోసా

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..  3వ వార్డు కౌన్సిలర్ కొండ రజిత

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ₹5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో ప్రారంభమైంది. పట్టణంలోని బస్టాండ్ వెనుక ప్రాంతంలో మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో ఈ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా 3వ వార్డు కౌన్సిలర్ కొండ రజిత సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అందులో భాగంగా ప్రతి అర్హ కుటుంబానికి ₹5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించేలా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పారు.

కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచే వ్యక్తికి అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడకుండా బీమా సొమ్ము ఆర్థిక భరోసాగా నిలుస్తుందని పేర్కొన్నారు. అందువల్ల అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు వార్డు ప్రజలు ఆధార్ కార్డు, రేషన్ కార్డులతో పాటు అవసరమైన వివరాలను తీసుకురావాలని సూచించారు. అర్హులైన ఒక్క కుటుంబం కూడా ఈ పథకం ప్రయోజనానికి దూరం కాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ కొండ రజిత సత్యనారాయణ, వార్డు అధికారి నిఖిత, వార్డు ఆర్‌పీ పున్న లావణ్యతో పాటు పలువురు వార్డు ప్రజలు పాల్గొన్నారు.