భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్లైన్ నమోదు కార్యక్రమం తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మోర సంధ్య బిక్షం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన MPDO చలపతి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మోర సంధ్య బిక్షం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సహకారంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో అమలు చేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ₹5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించనున్నట్లు చెప్పారు.
కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా అండగా నిలవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆన్లైన్ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోర సంధ్య, బిక్షం, APO కృష్ణయ్య, గ్రామ కార్యదర్శి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.