భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

చిన్ననాగారంలో విషాదం.. బిక్షపతి చారి మృతి

కర్ర పని నైపుణ్యకారుడు బిక్షపతి చారి కన్నుమూత.

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వడ్రంగి వృత్తిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నైపుణ్యకారుడు పోలోజు బిక్షపతి చారి (86) కన్నుమూశారు. ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మంగళవారం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమకు ఎన్నో ఏళ్లుగా పరిచయమున్న నైపుణ్యకారుడు దూరమయ్యాడని గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.

వడ్రంగి వృత్తిలో బిక్షపతి చారికి ఎంతో అనుభవం, అసాధారణ ప్రతిభ ఉండేది. ఎలాంటి డిజైన్‌తో కూడిన చెక్క వస్తువునైనా తన చేతి పనితనంతో ఎంతో సులభంగా తయారు చేసేవారని గ్రామస్థులు గుర్తుచేసుకున్నారు. వ్యవసాయ పనులకు అవసరమైన పరికరాల నుంచి ఇంట్లో ఉపయోగించే వస్తువుల వరకు ఎన్నో రకాల చెక్క సామగ్రిని రూపొందించడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉండేది. తన వృత్తి నైపుణ్యంతో కార్పెంటర్ పనికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు.

చిన్ననాగారం గ్రామంలో ఆయన చేతితో తయారైన వస్తువులు లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఎన్నో కుటుంబాలకు అవసరమైన చెక్క వస్తువులను తయారు చేసి అందించిన ఆయన సేవలను గ్రామస్థులు గుర్తుచేసుకుంటున్నారు. కర్ర పనిలో ఆయనకు ఆయనే సాటి అని, తన చేతి పనితనంతో ఎంతోమంది మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని నివాళులర్పించారు. ఆయన మరణం గ్రామానికి, వడ్రంగి వృత్తికి తీరని లోటని పలువురు విచారం వ్యక్తం చేశారు.

బిక్షపతి చారికి భార్య యశోద, ముగ్గురు కుమారులు సోమేశ్వర చారి (బాబు), దేవేంద్ర చారి, శ్రీనివాసాచారి, కుమార్తె శోభ ఉన్నారు. బుధవారం నిర్వహించిన ఆయన అంతిమయాత్రలో గ్రామస్థులు, బంధువులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.