భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఓటు హక్కు పరిరక్షణ, భారత రాజ్యాంగ విలువల సంరక్షణ లక్ష్యంగా నవంబర్ 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘ఓట్ బచావో – దేశ్ బచావో – సంవిధాన్ రక్షక్ మార్చ్’లో పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి జిల్లా నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తరలిరావాలని కోరారు.
ఈ సందర్భంగా ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల ఓట్లు తొలగించబడ్డాయనే అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఇప్పటికే ఓటు హక్కు పొందిన వారి హక్కులను కూడా కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని అన్నారు.
ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలని, అర్హులైన ఓటర్లలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కును పరిరక్షించడం, భారత రాజ్యాంగం అందించిన విలువలను కాపాడటం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు TPCC ఆధ్వర్యంలో నవంబర్ 26, గురువారం హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉదయం 10:30 గంటలకు ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం (లిబర్టీ) నుంచి ఈ మార్చ్ ప్రారంభమవుతుందని తెలిపారు. అక్కడి నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందని వివరించారు.
ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బ్లాక్, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ర్యాలీలో పాల్గొనాలని ఆంజనేయులు గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు ప్రాధాన్యత, రాజ్యాంగ విలువల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.