భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

ఎల్‌నినో ప్రభావంపై కిషన్ తండా, రాయలాపూర్‌లో అవగాహన

రామాయంపేట మండలం కిషన్ తండా రాయలపూర్ గ్రామాలలో గ్రామసభ

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎల్‌నినో ప్రభావంతో రానున్న యాసంగి సీజన్‌లో భూగర్భ జలాల మట్టం మరింత పడిపోయే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కోరారు. ఈ మేరకు మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కిషన్ తండా, రాయలాపూర్ గ్రామాల్లో ఎల్‌నినో వాతావరణ పరిస్థితులపై ప్రత్యేక గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఎల్‌నినో ప్రభావం, భవిష్యత్తులో ఎదురయ్యే నీటి కొరత, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించారు. ముఖ్యంగా యాసంగి 2026 సీజన్‌లో రైతులు ఎవరూ వరి పంట సాగు చేయవద్దని సూచించారు. భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి పడిపోయే పరిస్థితులు ఉన్నందున ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని తెలిపారు.

రామాయంపేట మండలం కిషన్ తండా రాయలపూర్ గ్రామాలలో గ్రామసభ

కూరగాయలు, జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి తక్కువ నీటితో పండించే పంటలను సాగు చేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా సాగునీటి కొరత సమస్యను కొంతవరకు అధిగమించవచ్చని వివరించారు.

అలాగే రైతులకు అవసరమైన జొన్న, మొక్కజొన్న విత్తనాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ విత్తనాలు కావాల్సిన రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డుతో రామాయంపేట వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించి విత్తనాలు పొందవచ్చని సూచించారు.

రామాయంపేట మండలం కిషన్ తండా రాయలపూర్ గ్రామాలలో గ్రామసభ

పామ్ ఆయిల్ సాగుపై కూడా రైతులకు అవగాహన కల్పించారు. ఆయిల్ పామ్ పంట సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, మొక్కల కొనుగోలుకు ప్రభుత్వం అందించే సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుకు సంబంధించిన రాయితీల వివరాలను అధికారులు వివరించారు. రైతులు భవిష్యత్తులో నీటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని పంటల ఎంపికలో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ప్రవీణ్, AEO సందీప్, సాయికృష్ణ, MPO, ఇరిగేషన్ AEతో పాటు ఇతర మండల స్థాయి అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయంలో తగిన మార్పులు చేసుకోవాలని, నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.