భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

నవంబర్ 26న కలెక్టరేట్ ఎదుట వ్యవసాయ కార్మికుల ధర్నా

వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, రేపు కలెక్టరేట్‌ ఎదుట ధర్నాను విజయవంతం చేయాలి: సరిగంజ

భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సరిగంజి వీరస్వామి డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు నవంబర్ 26న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నా కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

కేంద్రంలో BJP ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ కూలీల పట్ల వివక్ష చూపుతోందని వీరస్వామి ఆరోపించారు. గతంలో UPA-1 ప్రభుత్వ హయాంలో కార్మికులు పోరాడి సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త పథకాన్ని తీసుకురావడం వ్యవసాయ కార్మికుల జీవనోపాధికి ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డుల రద్దు, పని ప్రదేశాల్లో కూలీలకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించకపోవడం వంటి సమస్యలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు. పని ప్రదేశాల్లో టెంట్లు, గడ్డపారలు, తాగునీరు, వైద్య కిట్లు వంటి సౌకర్యాలు అందించడంలో వైఫల్యం కూలీలకు ఇబ్బందులు కలిగిస్తోందని విమర్శించారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని వీరస్వామి విమర్శించారు. వ్యవసాయ కార్మికులకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ₹12 వేల ఆర్థిక సాయం, మహిళలకు నెలకు ₹2,500 అందిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దీనికి తోడు ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రానున్న పరిస్థితులపై ప్రజల్లో ఆందోళన నెలకొనే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నవంబర్ 26న చేపట్టనున్న ఈ ధర్నాలో వ్యవసాయ కార్మికులు, సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సరిగంజి వీరస్వామి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.