భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

బాసర ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

బాసర ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులతో పాటు రానున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు బుధవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు.

బాసర ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

ముందుగా గోదావరి నది తీరంలోని పుష్కర స్నాన ఘాట్‌ను సందర్శించిన అధికారులు, అక్కడ చేపడుతున్న అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పుష్కరాల సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు బాసరకు తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారి రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్నాన ఘాట్‌ అభివృద్ధి, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు తెలిపారు.

అనంతరం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ఉన్నతాధికారులు, ఆలయంలో కొత్తగా చేపడుతున్న అభివృద్ధి, నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయ గోపుర నిర్మాణానికి సంబంధించి శిలా స్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోపుర నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా చేశారు.

బాసర ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న నూతన మండపం, గోపుర నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులు, నిర్మాణ ప్రణాళికలు, పనుల నాణ్యత, తదుపరి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి, నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షణ ఉండాలని సూచించారు.

బాసర ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

బాసర పుణ్యక్షేత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంపొందించేలా అభివృద్ధి పనులు చేపట్టాలని ఉన్నతాధికారులు తెలిపారు. నిర్ణీత కాలపరిమితిలో పనులు పూర్తి చేసేలా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, ఆలయ EO అంజనీదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు విజయలక్ష్మి, రమణ, శ్రీనివాస్, తుకారాం, గంగారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రాజేందర్, సందీప్, తహసీల్దార్ పవన్ చంద్ర, MPDO ఏ. రామకృష్ణ, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అధికారులు, సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.