భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

ట్రాఫిక్ రూల్స్‌పై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన

ట్రాఫిక్ రూల్స్ పై.. స్టూడెంట్ తో ప్రదర్శన చేయించిన టీచర్ -సామాజిక బాధ్యత పెంపొందించడమే లక్ష్యం

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: విద్యార్థులకు పాఠ్యాంశాలను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష అనుభవం ద్వారా నేర్పిస్తే ఆచరణాత్మక పరిజ్ఞానంతో పాటు సామాజిక బాధ్యత కూడా పెరుగుతుందని సామాజిక శాస్త్ర ఉపాధ్యాయురాలు అంజుమ్ సుల్తానా తెలిపారు. ఈ లక్ష్యంతో నెల్లికుదురు మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ 7వ తరగతి విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

రవాణా వ్యవస్థ పాఠ్యాంశంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపాల్ రావు అనుమతితో విద్యార్థులను రహదారిపైకి తీసుకెళ్లి క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతా నియమాలను విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరిస్తూ అవగాహన కల్పించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాలను నివారించడంలో నిబంధనలు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.

హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ సిగ్నళ్లను పాటించడం, రహదారిపై ప్రయాణించే సమయంలో భద్రతా నియమాలను అనుసరించడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాల నుంచి తమను తాము కాపాడుకోవడంతో పాటు ఇతరుల భద్రతకు కూడా సహకరించవచ్చని తెలిపారు.

పాఠ్యాంశాలను ర్యాలీలు, క్షేత్ర పర్యటనలు, ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు విషయాలు సులభంగా అర్థమవుతాయని, వాటిని రోజువారీ జీవితంలో పాటించే అవకాశం ఉంటుందని అంజుమ్ సుల్తానా పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, రహదారి భద్రతపై అవగాహన, ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.