భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

సంస్కృత అకాడమీలో మరింగంటి శ్రీరంగాచార్య శతజయంతి వేడుకలు ప్రారంభం

సంస్కృత అకాడమీలో మరింగంటి శ్రీరంగాచార్య శతజయంతి వేడుకలు ప్రారంభం

భారత్ సమాచార్, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోని సంస్కృత అకాడమీలో మరింగంటి శ్రీరంగాచార్యుల శతజయంతి ఉత్సవాలు నవంబర్ 25న ఘనంగా ప్రారంభమయ్యాయి. 2027 నవంబర్ వరకు ఏడాది పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆచార్యుల పాండిత్య వైభవం, సంస్కృత శాస్త్రాలకు వారు అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ వివిధ కార్యక్రమాలు, ఉపన్యాసాలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు శ్రీరంగాచార్యుల విశిష్ట పాండిత్యాన్ని స్మరించుకుని ఘనంగా నివాళులర్పించారు. న్యాయ, వ్యాకరణ, వేదాంత, సాహిత్య శాస్త్రాల్లో విశేష పరిజ్ఞానం సంపాదించిన మరింగంటి శ్రీరంగాచార్యులు తెలంగాణకే కాకుండా తెలుగు రాష్ట్రాలన్నింటికీ గర్వకారణమని కొనియాడారు. వేదాంత ప్రవచనాల ద్వారా ఆధ్యాత్మిక, శాస్త్ర సంప్రదాయాలను ప్రజలకు చేరువ చేసిన గొప్ప పండితులుగా వారి సేవలను గుర్తుచేసుకున్నారు.

ఆచార్యుల సంప్రదాయాన్ని కొనసాగించడంతో పాటు సంస్కృత శాస్త్రాలపై ఆసక్తి ఉన్న పండితులు, విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ సందర్భంగా ప్రత్యేక సన్మానాలు, పురస్కారాలు అందజేశారు. ఈ ఏడాది ఉత్తమ శాస్త్రపండితులుగా శ్రీమాన్ పరవస్తు శేషావతారం, శ్రీమాన్ గొబ్బూరి బదరీనాథాచార్యులు సన్మానం పొందారు. ఉత్తమ శాస్త్ర విద్యార్థిగా శ్రీ బి. రమణ పురస్కారాన్ని అందుకున్నారు.

తెలంగాణ సంగీత నాటక అకాడమీ మాజీ అధ్యక్షురాలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దీపికారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై మరింగంటి శ్రీరంగాచార్యులకు ఘనంగా నివాళులర్పించారు. శ్రీమాన్ మరింగంటి శ్రీరంగాచార్య స్మారక పురస్కార సమితి అధ్యక్షుడు శ్రీమాన్ సి.హెచ్. లక్ష్మీనాథాచార్యులు, శ్రీమాన్ సముద్రాల శఠకోపాచార్యులు, శ్రీమాన్ మరింగంటి విజయసారథి తదితరులు సభలో పాల్గొన్నారు.

అలాగే శ్రీమాన్ పి.టి.జి. రంగా, శ్రీమాన్ రంగి, శ్రీమాన్ భాగవతుల లక్ష్మణాచార్యులు, సత్యనారాయణ తదితరులు ఈ సందర్భంగా ఆచార్యులకు నివాళులర్పించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, వాచస్పతి ఆచార్య పెన్నా మధుసూదన్ (సంస్కృత అకాడమీ సంచాలకులు) ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. శ్రీరంగాచార్యులతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ వారి పాండిత్యం, సేవలను స్మరించుకున్నారు.

మరింగంటి శ్రీరంగాచార్యుల శతజయంతిని పురస్కరించుకుని ఏడాది మొత్తం వారి స్మృతిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఈ ఉత్సవాల ద్వారా ఆచార్యుల శాస్త్ర పాండిత్యాన్ని నేటి తరానికి పరిచయం చేయడంతో పాటు సంస్కృత విద్య, సంప్రదాయాల పట్ల యువతలో ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాలను కొనసాగించనున్నారు.