భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

శేరిపల్లిలో కొనసాగుతున్న ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు

శేరిపల్లిలో కొనసాగుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు..

భారత్ సమాచార్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో కొనసాగుతోంది. గ్రామంలో మొత్తం 702 మంది ఈ పథకానికి అర్హులుగా ఉండగా, బుధవారం నాటికి సుమారు 100 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నట్లు నాయకులు గొండస్వామి తెలిపారు.

గ్రామ సర్పంచ్ సంతోష గొండస్వామి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు బీమా నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామ నాయకులు గొండస్వామి యాదవ్, శ్రీరామ్ భరత్ అవసరమైన సూచనలు చేస్తూ నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం వివరాలు తెలియజేసి, వారి పేర్లు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

శేరిపల్లిలో కొనసాగుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు..

ఈ సందర్భంగా గొండస్వామి, శ్రీరామ్ భరత్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకం ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన కుటుంబంలో సంపాదించే సభ్యుడికి ₹5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు.

బీమా పొందిన వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే, ఆ కుటుంబం పేర్కొన్న నామినీకి ₹5 లక్షల బీమా పరిహారం అందుతుందని తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. దీంతో కుటుంబంలో సంపాదించే వ్యక్తికి అనుకోని ప్రమాదం జరిగినా, ఆర్థికంగా కుటుంబానికి కొంత భరోసా లభిస్తుందని పేర్కొన్నారు.

బీమా నమోదు చేసుకునే సమయంలో అర్హులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నంబర్‌తో పాటు నామినీకి సంబంధించిన వివరాలను అందించాలని సూచించారు. గ్రామంలో ఇంకా నమోదు చేసుకోని అర్హులైన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వివరాలను నమోదు చేసుకోవాలని గొండస్వామి, శ్రీరామ్ భరత్ కోరారు.