భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలవడానికి మన భారత రాజ్యాంగమే బలమైన పునాది అని BJP నాయకులు తెలిపారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువలను అందించిందని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని మెదక్ రోడ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద BJP నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, రాజ్యాంగం దేశానికి అందించిన గొప్ప విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థలో దాని ప్రాధాన్యతను వివరించారు.
1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన చారిత్రాత్మక రోజును గుర్తుచేసుకుంటూ రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నాయకులు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ, దేశ సమగ్రతకు ప్రతి పౌరుడు తన వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని SC మోర్చా జిల్లా అధ్యక్షుడు బాలరాజ్ ఆధ్వర్యంలో రామాయంపేటలో నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు అవినాష్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు సీతారాములు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు సంగయ్య, కొత్తపల్లి దయాకర్, భానుచందర్, కొత్తపల్లి యాదగిరి, శకని మహేష్, కుంట సరితతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.