భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

హుస్నాబాద్‌లో రాజ్యాంగ రక్షణ బైక్ ర్యాలీ

రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం.

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జాతీయ మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజల్లో రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ రక్షణ బైక్ ర్యాలీ చేపట్టి రాజ్యాంగ విలువలను చాటుతూ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమానికి జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఆరె కిశోర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. భారత రాజ్యాంగం వర్ధిల్లాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భిన్న మతాలు, కులాలు, వర్గాలతో కూడిన భారతదేశాన్ని ఐక్యంగా నడిపించేందుకు రాజ్యాంగం ఎంతో అవసరమని ఆనాటి పెద్దలు గుర్తించారని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా నియమించగా, ఆయన ఎన్నో వ్యక్తిగత ఇబ్బందులు, సవాళ్లను ఎదుర్కొంటూ అట్టడుగు వర్గాల హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన చారిత్రాత్మక సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఏటా ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని వివరించారు.

దేశంలో ఇప్పటికీ అనేక వర్గాలు పేదరికంలో మగ్గుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులకు పూర్తిస్థాయిలో దూరంగా ఉన్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ రాజ్యాంగాన్ని మార్చి మనువాద భావజాలాన్ని అమలు చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, సామాజిక ఉద్యమకారులు సంఘటితమై రాజ్యాంగ పరిరక్షణ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు సిద్దిపేట జిల్లా మీడియా ఇన్‌చార్జి జాల శ్రీనివాస్, హుస్నాబాద్ జై భీమ్ సైనిక్ దళ్ మండల అధ్యక్షుడు దుండ్ర సుమన్, నాయకులు సుంకే రమేష్, నోముల బాలయ్య, డ్యాగాల సతీష్, సావుల రమేష్, సుంకే సంపత్, గద్ద శ్రీనివాస్, డ్యాగాల మహేందర్, జాల రాజు, భోజ అనిల్, మేదిని ఆంజనేయులు, సుంకే కుమార్, జాల సాయి, పున్న సాయి శివ, నాలువల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.