భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎనిమిది నెలల క్రితం సంచలనం సృష్టించిన వలస కూలీ హత్య కేసు మిస్టరీని రామాయంపేట పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి వద్ద జరిగిన హత్యకు సంబంధించి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన బరాస్ సర్దార్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
గురువారం రామాయంపేట సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో DSP నరేందర్ గౌడ్ కేసు వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 22న మిర్జాపల్లి వద్ద దేనా హెమ్రామ్ అనే వలస కూలీ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తి తలపై బండరాయితో బలంగా కొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి నుంచి వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగించారు.
పోలీసుల కథనం ప్రకారం.. మృతుడు దేనా హెమ్రామ్, నిందితుడు బరాస్ సర్దార్ ఇద్దరూ కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో వ్యక్తిగత విషయాలపై వారి మధ్య గొడవ మొదలైంది. తొలుత మాటామాటా పెరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో క్షణికావేశానికి గురైన బరాస్ సర్దార్ బండరాయితో హెమ్రామ్పై దాడి చేసి హత్య చేసినట్లు DSP నరేందర్ గౌడ్ తెలిపారు.
హత్య జరిగిన తర్వాత కేసును ఛేదించేందుకు పోలీసులు సుదీర్ఘంగా దర్యాప్తు చేపట్టారు. వివిధ ఆధారాలను పరిశీలించి, నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. దీంతో ఎనిమిది నెలలుగా మిస్టరీగా ఉన్న వలస కూలీ హత్య కేసుకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది.
ఈ మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదా నాయక్, SI నారాయణ గౌడ్, చిన్నశంకరంపేట SI శివానందం, రామాయంపేట SI-2 నరేష్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.