భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం, చేపట్టిన అమరణ నిరాహార దీక్ష ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టాలని హుస్నాబాద్ BRS నాయకులు తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరోసారి చాటేందుకు ఈ నెల 29న అల్గునూర్లో నిర్వహించనున్న దీక్షా దివస్ భారీ బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని BRS పార్టీ కార్యాలయంలో గురువారం దీక్షా దివస్ సందర్భంగా అల్గునూర్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ పోస్టర్ను నాయకులు ఆవిష్కరించారు. BRS హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు పెరుక భాగ్యరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ దాదాపు రెండు దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేశారని గుర్తుచేశారు. ఎన్నో ఉద్యమాలు, ప్రజల పోరాటాలు, అమరుల ప్రాణత్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. కరీంనగర్ నుంచి అల్గునూర్ మీదుగా వెళ్తున్న సమయంలో కేసీఆర్ను అల్గునూర్ చౌరస్తా వద్ద అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారని తెలిపారు. ఆ తర్వాత ఆయన చేపట్టిన అమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిందని వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగాయని నాయకులు అన్నారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని విమర్శించారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్ సమస్యలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలు పండించలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వంలో మరోసారి ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల హక్కులు, రైతుల సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం BRS శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ నెల 29న అల్గునూర్లో నిర్వహించే దీక్షా దివస్ భారీ బహిరంగ సభకు హుస్నాబాద్ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ గాదెపాక రవీందర్, మాజీ పట్టణ అధ్యక్షుడు ఎం.ఏ. అన్వర్, నాయకులు కాయిత రాజేందర్ రెడ్డి, అనుమాండ్ల ప్రభాకర్ రెడ్డి, ఎం. ప్రభాకర్ రెడ్డి, బండి రమణారెడ్డి, బత్తుల జగ్జీవన్ రామ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.