భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: విద్యార్థినులు చదువులో మరింత ప్రతిభ కనబరిచి ఉత్తమ ఫలితాలతో పాటు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించేలా అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిద్దిపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె. మాధవరావు సూచించారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించి విద్యా బోధన, కళాశాల నిర్వహణను పరిశీలించారు.
ఈ సందర్భంగా తరగతి గదులకు వెళ్లి అధ్యాపకులు విద్యార్థినులకు అందిస్తున్న బోధనను పరిశీలించారు. విద్యార్థినులతో నేరుగా మాట్లాడి చదువులో ఎదురవుతున్న ఇబ్బందులు, విద్యా ప్రగతి గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కళాశాలలోని పలు రికార్డులను తనిఖీ చేసి ప్రిన్సిపల్, అధ్యాపకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
గత విద్యా సంవత్సరంలో కళాశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం పట్ల డీఐఈఓ అభినందనలు తెలిపారు. ఈ ఏడాది కూడా అంతకంటే మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించే దిశగా విద్యార్థినులను ప్రోత్సహించాలని అధ్యాపకులకు సూచించారు. ప్రతి విద్యార్థినిపై ప్రత్యేక దృష్టి సారించి, వారి సామర్థ్యాలకు అనుగుణంగా బోధన అందించాలని తెలిపారు.
విద్యార్థినులకు నాణ్యమైన విద్యాబోధన అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని, పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా నిరంతరం మార్గనిర్దేశం చేయాలని అధ్యాపకులకు సూచించారు. విద్యార్థినుల ప్రతిభతో కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వి. లలిత, అధ్యాపకులు డి. రవీందర్, ఎస్. సదానందం, టి. నిర్మలాదేవి, బి. లక్ష్మయ్య, డి. కర్ణాకర్, కె. స్వరూప, ఎస్. కవిత, జి. కవిత, ఆస్మా ఫిర్దోస్, ఓ. రాణి, జూనియర్ అసిస్టెంట్లు ఎస్. రాములు, కె. గీతాంజలి, రికార్డు అసిస్టెంట్ టి. రమాదేవి, విద్యార్థినులు పాల్గొన్నారు.