భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని తమ పంటను మద్దతు ధరకు విక్రయించుకోవాలని ఇనుగుర్తి మండలం మీట్యా తండా సర్పంచి భూక్య చిన్ని వెంకన్న సూచించారు. రైతులకు మధ్యవర్తుల ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించుకోవాలని కోరారు.
ఇనుగుర్తి మండలం మీట్యా తండా పరిధిలో రాజమాత ఐకెపి కొనుగోలు కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం సర్పంచి భూక్య చిన్ని వెంకన్న, ఏపీఎం రాజేంద్ర కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రారంభానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ రైతులకు అందుబాటులో ఉన్న కొనుగోలు సదుపాయాలను వివరించారు.
అనంతరం సర్పంచి చిన్ని వెంకన్న మాట్లాడుతూ దళారీ వ్యవస్థను నిర్మూలించి రైతులకు నేరుగా ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. రైతులు ప్రైవేట్ వ్యాపారులపై ఆధారపడకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి విక్రయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా సన్న వడ్లు పండించిన రైతులకు ప్రభుత్వం క్వింటాల్‌కు ₹.500 బోనస్ కూడా చెల్లిస్తోందని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పిట్టల శేఖర్, సీసీ పుల్లయ్య, సీఏ బైరు శ్రీమతి, కొనుగోలు కేంద్రం ఇన్చార్జి నాయిని కోమలతతో పాటు రైతులు చెడు పాక యాకయ్య, నాయిని కొమరయ్య, ఉడత సంతోష్ యాదవ్, గుండ్ల వెంకన్న, గుగులోతు రవి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.