భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: మహిళల హక్కుల పరిరక్షణ, వ్యవసాయ కార్మికుల సంక్షేమం, లింగ సమానత్వం సాధించడమే లక్ష్యంగా గ్రామస్థాయిలో జెండర్ కమిటీని ఏర్పాటు చేశారు. నవక్రాంతి సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న బెటర్ కాటన్ ఇనిషియేటివ్ (బీసీఐ) ప్రాజెక్టులో భాగంగా అక్కన్నపేట మండలం గండిపల్లిలో గురువారం కమిటీ పరిచయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం, సభ్యుల విధులు, బాధ్యతలను గ్రామస్థులకు వివరించారు.
గ్రామంలో మహిళలు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయడం జెండర్ కమిటీ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా మహిళల హక్కులకు భంగం కలిగిన సందర్భాల్లో వారికి అండగా నిలవడంతో పాటు, కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పారు. బాధిత మహిళలు తమ సమస్యలను ఎలాంటి భయం లేకుండా, గోప్యత పాటిస్తూ కమిటీ దృష్టికి తీసుకురావచ్చని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా బీసీఐ ప్రాజెక్టు జెండర్ అండ్ లైవ్లీహుడ్ నిపుణురాలు కందుకూరి సౌజన్య మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో పనిచేసే మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాలని తెలిపారు. వారు చేసే పనికి తగిన న్యాయమైన వేతనాలు అందడంతో పాటు, సురక్షితమైన పని పరిస్థితులు ఉండాలని చెప్పారు. మహిళా కార్మికుల హక్కులు, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
అలాగే బాల కార్మికత్వం, బలవంతపు శ్రమను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజల్లో అవగాహన పెంచాలని సౌజన్య సూచించారు. కార్మికులు తమ హక్కుల గురించి తెలుసుకోవాలని, పని ప్రదేశాల్లో ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటిపై స్పందించాలని తెలిపారు. మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను పరిష్కరించడంలో జెండర్ కమిటీ కీలకంగా పనిచేస్తుందని వివరించారు.
మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదిగేందుకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ఆమె చెప్పారు. ఇందుకోసం సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుంటూ మహిళలకు అవసరమైన శిక్షణ, ఉపాధి మార్గాలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. తద్వారా మహిళలకు అదనపు ఆదాయ వనరులు ఏర్పడటంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి, ఫీల్డ్ ఫెసిలిటేటర్లు రవి, ఉదయ్, శశి, బీసీఐ రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.