భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

రోడ్డును ఆక్రమిస్తే జైలుకే.. నర్సాపూర్‌లో కోర్టు తీర్పు

జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం.. పండ్ల వ్యాపారికి పది రోజుల జైలు శిక్ష

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జాతీయ రహదారిపై పండ్ల బండిని ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించిన వ్యాపారికి న్యాయస్థానం పది రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. నర్సాపూర్ పట్టణంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించేలా రహదారిని ఆక్రమించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేయగా, విచారణ అనంతరం కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

నర్సాపూర్ పట్టణంలోని NH-765D జాతీయ రహదారిపై మెదక్ వైపు వెళ్లే మార్గంలో చైతన్యపురి కాలనీకి చెందిన శక్తి ఆకాష్ (30) పండ్ల బండిని ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నాడు. దీంతో ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న SI ఏ. రంజిత్ కుమార్ ఈ విషయాన్ని గుర్తించి చర్యలు చేపట్టారు.

గత ఐదు నుంచి ఆరు నెలలుగా జాతీయ రహదారిపై బండ్లు ఏర్పాటు చేయవద్దని పోలీసులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ వ్యాపారి పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. హెచ్చరికలను లెక్కచేయకుండా రహదారిని ఆక్రమించి పండ్ల బండిని కొనసాగించడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం కూడా ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు.

ఈ కేసును విచారించిన నర్సాపూర్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ పి. బాలరెడ్డి నిందితుడు శక్తి ఆకాష్‌కు పది రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు అతడిని సంగారెడ్డి జిల్లా కంది కేంద్ర కారాగారానికి తరలించారు.

ఈ సందర్భంగా నర్సాపూర్ పోలీసులు మాట్లాడుతూ జాతీయ రహదారులు, ప్రధాన రహదారులు, చౌరస్తాలు, పాదచారుల మార్గాలను ఆక్రమించి పండ్ల బండ్లు లేదా చిరు వ్యాపారాలు నిర్వహించరాదని హెచ్చరించారు. రహదారులపై వ్యాపారాలు నిర్వహిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే కేసులు నమోదు చేసి న్యాయస్థానం ద్వారా శిక్షలు పడేలా చర్యలు చేపడతామని తెలిపారు.

ప్రజల భద్రత, వాహనదారుల సురక్షిత ప్రయాణమే తమ ప్రధాన లక్ష్యమని పోలీసులు పేర్కొన్నారు. రహదారులపై ఆక్రమణలకు పాల్పడకుండా వ్యాపారులు సహకరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వ్యవహరించాలని సూచించారు.