భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

కోనాపూర్‌లో అకాల వర్షం.. రైతులకు భారీ నష్టం

కోనాపూర్‌లో అర్ధరాత్రి వర్ష బీభత్సం.. రైతులకు కన్నీళ్లే మిగిల్చిన ప్రకృతి..

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి కురిసిన భారీ అకాల వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. నెలల తరబడి కష్టపడి, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపానికి రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఒక్కసారిగా కురిసిన వర్షానికి వరద నీరు పోటెత్తడంతో కోత కోసి ఆరబెట్టిన ధాన్యం కొంత పూర్తిగా కొట్టుకుపోగా, మిగిలిన ధాన్యం తడిసి ముద్దయింది.

గ్రామంలోని కోనాపూర్ బండపై సుమారు 30 మంది రైతులు కోసిన ధాన్యాన్ని ఆరబోసి ఉంచారు. అక్కడ దాదాపు 50 ట్రాక్టర్ల ధాన్యం ఉండగా, అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో వరద నీరు ఒక్కసారిగా బండపైకి చేరింది. దీంతో సుమారు 20 నుంచి 30 ట్రాక్టర్ల వడ్లు బండపై నుంచి కిందకు కొట్టుకుపోయి మట్టిలో కలిసిపోయాయి. మిగిలిన ధాన్యం కూడా పూర్తిగా తడిసిపోవడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది.

కోనాపూర్‌లో అర్ధరాత్రి వర్ష బీభత్సం.. రైతులకు కన్నీళ్లే మిగిల్చిన ప్రకృతి..

అప్పులు చేసి పంట పండిస్తే.. కళ్లముందే కొట్టుకుపోయింది!

రైతులు నెలల తరబడి పొలాల్లో కష్టపడుతూ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చుల కోసం అప్పులు చేసి పంట సాగు చేశారు. పంట చేతికొచ్చిన తర్వాత ధాన్యం అమ్మి అప్పులు తీర్చుకోవడంతో పాటు కుటుంబ అవసరాలు తీర్చుకోవచ్చని ఆశించారు. కానీ అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం వారి ఆశలపై నీళ్లు చల్లింది. కళ్లముందే ధాన్యం వరదలో కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేని పరిస్థితిలో రైతులు కన్నీరుమున్నీరయ్యారు.

కోనాపూర్‌లో అర్ధరాత్రి వర్ష బీభత్సం.. రైతులకు కన్నీళ్లే మిగిల్చిన ప్రకృతి..

కొట్టుకుపోయిన ధాన్యం కోసం బండ కింద వెతికినా ప్రయోజనం లేకుండా పోయిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చే పరిస్థితి లేకపోగా, చేతికొచ్చిన పంట కూడా దక్కకపోవడంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని, జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు.

బాధిత రైతులను పరామర్శించిన పద్మాదేవేందర్ రెడ్డి

కోనాపూర్‌లో అర్ధరాత్రి వర్ష బీభత్సం.. రైతులకు కన్నీళ్లే మిగిల్చిన ప్రకృతి..

కోనాపూర్ గ్రామంలో రైతులకు జరిగిన నష్టం గురించి తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గురువారం గ్రామాన్ని సందర్శించారు. వరద నీటికి కొట్టుకుపోయిన ధాన్యాన్ని పరిశీలించి, బాధిత రైతులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితిని తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ప్రకృతి వైపరీత్యం కారణంగా నష్టపోవడం చాలా బాధాకరమన్నారు. పంట చేతికొచ్చే సమయంలో ఇలాంటి ఘటన జరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు.

కోనాపూర్‌లో అర్ధరాత్రి వర్ష బీభత్సం.. రైతులకు కన్నీళ్లే మిగిల్చిన ప్రకృతి..

వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వర్షం కారణంగా జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేయాలని కోరారు. నష్టపోయిన ప్రతి రైతు వివరాలను నమోదు చేసి, వారికి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆర్డీఓ, తహసీల్దార్‌లకు ఫోన్ చేసి కోనాపూర్‌లో నెలకొన్న పరిస్థితిని వివరించారు. రైతులకు జరిగిన నష్టాన్ని వెంటనే నమోదు చేసి, పరిహారం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణ సహాయం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బిక్షపతి, మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, శంకరంపేట పార్టీ అధ్యక్షుడు పట్లోరి రాజు, రామాయంపేట యూత్ మండల అధ్యక్షుడు రాగి ఉమామహేశ్వర్, కోనాపూర్ మాజీ సర్పంచ్ ఇమ్మాయిల్, సంజీవ్, వెంకట్ రెడ్డి, సుశీల్, రవి తదితరులు పాల్గొన్నారు.