భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, కుటుంబాల ఆర్థిక భద్రతను దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ తిరుపతి రెడ్డి, నార్సింగి సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశ్ గౌడ్ కోరారు. అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
గురువారం మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం దరఖాస్తుల నమోదు ప్రక్రియను ఎంపీడీఓ తిరుపతి రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నమోదు కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతోంది, అర్హుల వివరాలు ఎలా సేకరిస్తున్నారు అనే అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ పథకానికి సంబంధించిన వివరాలను తెలుసుకుని, అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు.
మరోవైపు నార్సింగి మండల కేంద్రంలో సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశ్ గౌడ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం దరఖాస్తుల నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ కుటుంబ బీమాతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు అవగాహన పెంచుకుని, తమకు అర్హత ఉన్న పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేయిస్తామని కొందరు వ్యక్తులు ప్రజల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సర్పంచ్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఉచితంగానే అందిస్తుందని, వాటి కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పథకాల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే వారి మాటలు నమ్మకుండా వెంటనే సంబంధిత అధికారులకు లేదా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అమాయక ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా అందేలా ప్రజలు అధికారులకు సహకరించాలని ఎంపీడీఓ తిరుపతి రెడ్డి, సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశ్ గౌడ్ కోరారు. పథకాలపై తప్పుడు ప్రచారాలను నమ్మకుండా, మధ్యవర్తుల మాటలకు మోసపోకుండా నేరుగా అధికారులను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాగరాజు, నాయకులు గొండస్వామి యాదవ్, శ్రీరామ్ యాదగిరి, శేఖర్, సిద్దు యాదవ్, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.