భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడంతో పాటు రాజ్యాంగ ఆశయాలను ఆచరణలో పెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మాలల హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకుడు బొమ్మల మైసయ్య అన్నారు. రాజ్యాంగం అందించిన హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, వాటి పరిరక్షణ కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మాలల హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సందర్భంగా బొమ్మల మైసయ్య మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందని తెలిపారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి గొప్ప విలువలకు రాజ్యాంగం పునాది వేసిందని చెప్పారు. ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి భారత రాజ్యాంగం ఒక గొప్ప ఆయుధమని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, వాటి ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు.
రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, అందులో పొందుపరిచిన ఆశయాలను ఆచరణలో పెట్టాలని మైసయ్య కోరారు. హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత రాజ్యాంగ విలువలను తెలుసుకోవడంతో పాటు విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చింతకింది బాల ఎల్లం, మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు పాలేటి స్వామి, గరిజల స్వామి, రామాయంపేట మండల అధ్యక్షుడు దోసల కార్తీక్, నార్సింగి మండల కార్యదర్శి గుర్రాల స్వామి (బన్నీ), మండల సలహాదారు కందరి రమేష్, గ్రామ సలహాదారుడు గుణాల స్వామి (లింగం), కందరి రాజ్యం, MRPS సీనియర్ నాయకులు CH మార్కు, గుర్రాల రాము, కందరి శ్రీధర్, గుర్రాల ప్రవీణ్, కందరి ముత్యాలు, గోదల శివయ్య, గుర్రాల సిద్ధిరాములు, గరిజల సాయికుమార్ తదితరులతో పాటు మండల కమిటీ సభ్యులు, యువకులు, మాల సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.