భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ఈ నెల 29న అల్గునూర్లో నిర్వహించనున్న దీక్షా దివస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సభకు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం పట్టణ అధ్యక్షుడు పెరుక భాగ్యరెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివస్ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు.
అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ గాదెపాక రవీందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ దాదాపు రెండు దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. అనేక ఉద్యమాలు, ఎంతోమంది అమరుల ప్రాణత్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కరీంనగర్ నుంచి అల్గునూర్ మీదుగా వెళ్తున్న సమయంలో కేసీఆర్ను అల్గునూర్ చౌరస్తా వద్ద అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారని గుర్తుచేశారు. ఆ తర్వాత ఆయన చేపట్టిన అమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచిందని పేర్కొన్నారు.
పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు పెరుక భాగ్యరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాయని తెలిపారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రైతులు తాగునీరు, సాగునీరు, విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, పంటలు పండించలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వంలో మరోసారి ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని భాగ్యరెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటుతూ ఈ నెల 29న అల్గునూర్లో నిర్వహించే దీక్షా దివస్ భారీ బహిరంగ సభకు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ గాదెపాక రవీందర్, మాజీ పట్టణ అధ్యక్షుడు ఎం.ఏ. అన్వర్, నాయకులు కాయిత రాజేందర్ రెడ్డి, అనుమాండ్ల ప్రభాకర్ రెడ్డి, ఎం. ప్రభాకర్ రెడ్డి, బండి రమణారెడ్డి, బత్తుల జగ్జీవన్ రామ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.