భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అందించడమే లక్ష్యంగా రూపొందించబడిందని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని పలువురు నాయకులు అన్నారు. రాజ్యాంగం కల్పించిన విలువలను కాపాడుకోవడంతో పాటు వాటిని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గోపందాస్ కృష్ణ ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో యువజన సంఘం ప్రతినిధులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కార్యక్రమానికి హాజరైన నాయకులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందని తెలిపారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అందించాలనే గొప్ప లక్ష్యంతో రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, దాని విలువలను గౌరవిస్తూ ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గోపందాస్ కృష్ణ, దిశ కమిటీ సభ్యుడు గుజ్జునూరి బాబురావు, బేతమల్ల చంద్రయ్య, పింగిలి శ్రీనివాస్, బూర రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.