భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలి

ఆరుతడి పంటలు సాగు చేయాలి :ఏడిఏ శ్రీనివాసరావు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: యాసంగి సాగులో నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని రైతులు వరి పంటకు బదులుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని డివిజనల్ వ్యవసాయ అధికారి (ADA) అజ్మీర శ్రీనివాసరావు సూచించారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశాలున్న నేపథ్యంలో యాసంగి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులపై మండలంలోని ఆలేరు గ్రామంలో శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారి భూక్య మహేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ADA శ్రీనివాసరావు హాజరై రైతులకు పలు సూచనలు చేశారు.

ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, నీటి లభ్యత తగ్గే అవకాశాలపై శాస్త్రవేత్తలు చేసిన సూచనలను దృష్టిలో పెట్టుకుని రైతులు నీటిపై ఎక్కువగా ఆధారపడే వరి సాగుకు దూరంగా ఉండాలని తెలిపారు. యాసంగిలో జొన్న, సజ్జ, పెసర, మినుములు, కంది వంటి ఆరుతడి పంటలు, పప్పుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ పంటల సాగుతో నీటి వినియోగం తగ్గడంతో పాటు నేలలో భూసారం కూడా మెరుగుపడుతుందని వివరించారు. పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా రైతులు సాగు ఖర్చులను తగ్గించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఆరుతడి పంటలు సాగు చేయాలి :ఏడిఏ శ్రీనివాసరావు

సబ్సిడీపై పెసర విత్తనాలు అందుబాటులో..

రైతులకు సబ్సిడీపై పెసర విత్తనాలు అన్ని రైతు వేదికల్లో అందుబాటులో ఉన్నాయని శ్రీనివాసరావు తెలిపారు. వ్యవసాయ శాఖ సూచనల మేరకు అవసరమైన రైతులు విత్తనాలను పొందవచ్చని పేర్కొన్నారు. యాసంగి సాగులో నీటి పరిస్థితులను అంచనా వేసుకుని తగిన పంటలను ఎంపిక చేసుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గన్న హరీష్, ఇరిగేషన్ AE సుష్మ, పంచాయతీ కార్యదర్శి యాకుబ్, వ్యవసాయ విస్తరణ అధికారి మణికంఠ, వెటర్నరీ లైవ్ స్టాక్ అసిస్టెంట్ రాజేష్, గ్రామ రైతులు పాల్గొన్నారు.