భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

నవోదయ ప్రవేశ పరీక్షకు హుస్నాబాద్‌లో ఏర్పాట్లు పూర్తి

నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి....హుస్నాబాద్ మోడల్ స్కూల్‌లో 185 మంది విద్యార్థులకు పరీక్ష

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: జవహర్‌లాల్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాల కోసం శనివారం (నవంబర్ 28) హుస్నాబాద్ మోడల్ స్కూల్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఎ. వేణుకుమార్ తెలిపారు.

ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని వెల్లడించారు. హుస్నాబాద్ మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రంలో మొత్తం 185 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వీరిలో ఆంగ్ల మాధ్యమానికి చెందిన విద్యార్థులు 158 మంది ఉండగా, తెలుగు మాధ్యమానికి చెందిన వారు 27 మంది ఉన్నట్లు వివరించారు.

పరీక్ష నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక CLOతో పాటు తొమ్మిది మంది పర్యవేక్షకులను నియమించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రంలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని, పరీక్షను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి గంట ముందుగానే అంటే ఉదయం 10.30 గంటల లోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని మండల విద్యాధికారి బి. మనీల, చీఫ్ సూపరింటెండెంట్ ఎ. వేణుకుమార్ సూచించారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా హాల్‌టికెట్‌తో పాటు అవసరమైన గుర్తింపు కార్డులను వెంట తీసుకురావాలని స్పష్టం చేశారు. చివరి నిమిషంలో తొందరపడకుండా ముందుగానే కేంద్రానికి చేరుకుని పరీక్షకు సిద్ధం కావాలని సూచించారు.