భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

హుస్నాబాద్ డిపో ఎదుట టీఎంయూ ఆవిర్భావ వేడుకలు

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటం.. టీఎంయూ హుస్నాబాద్ డిపో కార్యదర్శి రాగిరెడ్డి  సుధాకర్ ర

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ఆర్టీసీ కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ఎప్పటికీ రాజీపడకుండా పోరాటం చేస్తుందని హుస్నాబాద్ డిపో కార్యదర్శి రాగిరెడ్డి సుధాకర్‌రెడ్డి తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల సాధనే లక్ష్యంగా యూనియన్ నిరంతరం పనిచేస్తోందని చెప్పారు.

టీఎంయూ ఏర్పడి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం హుస్నాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో కార్యదర్శి రాగిరెడ్డి సుధాకర్‌రెడ్డి యూనియన్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం యూనియన్ ప్రస్థానం, కార్మికుల సమస్యల పరిష్కారంలో చేపడుతున్న పోరాటాల గురించి మాట్లాడారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటం.. టీఎంయూ హుస్నాబాద్ డిపో కార్యదర్శి రాగిరెడ్డి  సుధాకర్ ర

ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో విలీనం చేసే వరకు కార్మికుల పక్షాన టీఎంయూ నిలబడుతుందని సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న వేతన సమస్యలు, ఉద్యోగ భద్రత, పని ఒత్తిడి, సెలవులు, పెండింగ్ బకాయిలు వంటి అంశాల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని తెలిపారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు.

యూనియన్ బలోపేతానికి కార్మికుల ఐక్యతే ప్రధానమని ఆయన అన్నారు. అందరూ కలిసికట్టుగా ఉంటూ హక్కుల సాధన కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గత 16 ఏళ్లుగా కొనసాగుతున్న పోరాట స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగిస్తూ కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు రమణారెడ్డి, ఎస్టీ రెడ్డి, పవన్, కొండాల్‌రెడ్డి, రాజు, పరశురాములు, రాజిరెడ్డితో పాటు మహిళా కార్మికులు జ్యోతి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.