భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: యాసంగి సాగులో రైతులు పంటల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని, నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇనుగుర్తి మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్.కె. యాస్మిన్ సూచించారు. మండలంలోని చిన్ననాగారం గ్రామ పంచాయతీ ఆవరణంలో శుక్రవారం ఆమె ఆధ్వర్యంలో యాసంగి సాగులో పంటల మార్పిడి, ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏవో యాస్మిన్ మాట్లాడుతూ.. ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు వేడెక్కడంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని, సాధారణంగా రావాల్సిన రుతుపవనాల దిశల్లో మార్పులు సంభవించాయని వివరించారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినా, మరికొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదని చెప్పారు.
వర్షాలు సరిగా లేకపోవడంతో భూగర్భ జలమట్టాలు పడిపోయాయని, ఈ పరిస్థితుల్లో యాసంగి పంటలకు నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని యాస్మిన్ తెలిపారు. నదీ జలాల ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రభావితమవుతోందని చెప్పారు. ఈ పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు. అయితే అవసరమైన సమయంలో విద్యుత్ అందుబాటులోకి రావడంపై కొంత అనిశ్చితి ఉండవచ్చని తెలిపారు.
ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వాలి
ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు ఈ యాసంగిలో నీరు ఎక్కువగా అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగలిగే ఆరుతడి పంటలను ఎంచుకోవాలని ఏవో యాస్మిన్ సూచించారు. జొన్న, సజ్జ, మినుము, పెసరతో పాటు కూరగాయల సాగుపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ పంటలను తక్కువ నీటితో పండించే అవకాశం ఉండటంతో పాటు రైతులకు లాభదాయకంగా ఉంటాయని వివరించారు.
రైతులకు అవసరమైన పెసర విత్తనాలు ఇనుగుర్తి రైతు వేదికలో సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయని యాస్మిన్ వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవో చందులాల్తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.