భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: పోలీసులు విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేస్తూ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, IPS సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం కోహెడ పోలీస్ స్టేషన్‌ను ఆమె తనిఖీ చేశారు. స్టేషన్‌కు చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు ఎస్ఐ అభిలాష్ ఆధ్వర్యంలో సిబ్బంది రిపోర్ట్ చేశారు. అనంతరం నిర్వహించిన పోలీస్ పరేడ్‌ను ఆమె పరిశీలించారు.
తనిఖీల్లో భాగంగా పోలీసు సిబ్బంది కిట్ ఆర్టికల్స్‌ను పరిశీలించడంతో పాటు, వివిధ కేసులకు సంబంధించిన వాహనాలను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులు, వివిధ విభాగాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ నిర్వహణ, సిబ్బంది విధులపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, క్రమశిక్షణతో ప్రజలకు సేవలు అందించాలని చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజల సమస్యలను ఓపికగా వినాలని, వాటిని పెండింగ్‌లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రజలకు, పోలీసులకు మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయని, పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల నిఘా కీలకమని సీపీ పేర్కొన్నారు. ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు, నిఘా వ్యవస్థను విస్తరించేలా ఎస్ఐ అభిలాష్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ద్వారా నేరాల నియంత్రణకు మరింత సహకారం అందేలా చూడాలని సూచించారు.
అనంతరం పోలీసు సిబ్బందితో మాట్లాడిన పోలీస్ కమిషనర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి విభాగం ఇన్‌చార్జి తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, స్టేషన్ పనితీరు మెరుగుపడేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ తనిఖీలో హుస్నాబాద్ ఏసీపీ సదానందం, ట్రైనీ డీఎస్పీలు సుమాశ్రీ, భారత్ రెడ్డి, ఎం.డి. ముషరఫ్, హుస్నాబాద్ సీఐ శ్రీధర్, కోహెడ ఎస్ఐ అభిలాష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.