భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తీసుకురానున్న మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులకు కాంగ్రెస్, BRS సహా దేశంలోని అన్ని విపక్ష పార్టీలు బేషరతుగా మద్దతివ్వాలని BJP మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.
శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర NDA ప్రభుత్వం మహిళలకు చట్టసభల్లో 33 శాతం ప్రాతినిధ్యం కల్పించాలనే గొప్ప లక్ష్యంతో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులోకి తీసుకువస్తోందని తెలిపారు. మహిళల రాజకీయ సాధికారతకు దోహదపడే ఈ కీలక నిర్ణయానికి అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.
లేనిపోని సాకులు చూపిస్తూ విపక్షాలు బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని సూచించారు. డీలిమిటేషన్ ద్వారా లోక్సభ, శాసనసభ స్థానాలు పెరిగి పాలనా సౌలభ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. దక్షిణాది, ఉత్తరాది ప్రాంతాల అంశాలను తెరపైకి తెచ్చి బిల్లులను అడ్డుకునే ప్రయత్నాలను విపక్షాలు విరమించుకోవాలని అన్నారు.
బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందితే తమ రాజకీయ మనుగడ దెబ్బతింటుందనే ఉద్దేశంతో విపక్షాలు అనవసర విమర్శలు చేస్తూ, సాకులు వెతుకుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని రాజ్ కుమార్ విమర్శించారు. మహిళలపై గౌరవం ఉన్నా, డీలిమిటేషన్ అంశంపై చిత్తశుద్ధి ఉన్నా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే సంబంధిత బిల్లులకు ఈ పార్లమెంట్ సమావేశాల్లో బేషరతుగా, పూర్తిస్థాయిలో మద్దతు తెలిపి ఆమోదం పొందేలా సహకరించాలని కోరారు.