భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ డివిజన్ రైతు ఆత్మ చైర్మన్ జంగపెల్లి ఐలయ్య కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పథకానికి సంబంధించిన వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా అండగా నిలవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
అనుకోని సంఘటనల వల్ల కుటుంబ పెద్దను కోల్పోతే కుటుంబ సభ్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు ఉంటాయని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన రైతు కుటుంబాలు, వ్యవసాయ కూలీలు, నిరుపేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, పేద కుటుంబాల ఆర్థిక భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఐలయ్య చెప్పారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ తదితర మండలాల ప్రజలు ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన ధ్రువపత్రాల వివరాలను తెలుసుకోవాలని సూచించారు. ఈ విషయంలో మరింత సమాచారం కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు.
అదేవిధంగా గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం కీలకంగా నిలుస్తుందని జంగపెల్లి ఐలయ్య పేర్కొన్నారు.