భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: పట్టుదల, కృషి, ప్రతిభతో ఉన్నత విద్యలో సత్తా చాటిన అక్కన్నపేట మండలం కేశవపూర్ గ్రామానికి చెందిన ఎర్రోజు కాలజ్ఞ కాకతీయ విశ్వవిద్యాలయం గోల్డ్ మెడల్ సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఎం.ఎస్సీ బయోటెక్నాలజీలో అత్యుత్తమ మార్కులు సాధించిన ఆమెకు ప్రతిష్ఠాత్మక ప్రొఫెసర్ బీర్ బహదూర్ గోల్డ్ మెడల్ లభించింది.
హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో శనివారం నవంబర్ 28న నిర్వహించిన 24వ స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా కాలజ్ఞ బంగారు పతకంతో పాటు అవార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.
2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎం.ఎస్సీ బయోటెక్నాలజీ కోర్సులో ప్రథమ శ్రేణితో ఉత్తీర్ణత సాధించడంతో పాటు, మొదటి ప్రయత్నంలోనే అత్యధిక మొత్తం మార్కులు సాధించిన విద్యార్థినిగా కాలజ్ఞ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతి ఏటా అందించే ప్రొఫెసర్ బీర్ బహదూర్ గోల్డ్ మెడల్‌ను ఆమె అందుకోవడం విశేషం.
సాధారణ గ్రామీణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన కాలజ్ఞ ఉన్నత విద్యలో సాధించిన ఈ విజయం పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆమె ఘనతతో కేశవపూర్ గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు, విద్యావేత్తలు కాలజ్ఞను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు సైతం పట్టుదల, కృషితో చదివితే ఉన్నత విద్యలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందవచ్చని ఎర్రోజు కాలజ్ఞ సాధించిన ఈ విజయం మరోసారి చాటిచెప్పింది.