భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: రైతు బీమా పథకాన్ని నిరంతరాయంగా కొనసాగించడంతో పాటు, ఆగస్టు నెల నుంచి మరణించిన రైతుల కుటుంబాలకు పెండింగ్లో ఉన్న బీమా పరిహారాన్ని వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శనివారం హుస్నాబాద్ వ్యవసాయ శాఖ డివిజన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ రాజుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రైతు రక్షణ సమితి హుస్నాబాద్ డివిజన్ అధ్యక్షుడు ఆయిలేని మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ.. ఆకస్మికంగా మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. అప్పటి నుంచి అమల్లో ఉన్న ఈ పథకం ద్వారా 2026 ఆగస్టు వరకు మరణించిన రైతుల కుటుంబాలకు బీమా పరిహారం అందించారని పేర్కొన్నారు. అయితే ఆగస్టు నెల నుంచి మరణించిన రైతుల కుటుంబాలకు బీమా సొమ్ము చెల్లింపులు నిలిచిపోయి పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.
ఆగస్టు నుంచి ఇప్పటి వరకు హుస్నాబాద్ వ్యవసాయ డివిజన్ పరిధిలో సుమారు 41 మంది రైతులు మరణించారని, వారి వివరాలను సంబంధిత అధికారులు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు బీమా పరిహారం అందలేదని అన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతు కుటుంబాలకు రైతు బీమా పథకం ఎంతో కీలకమైన ఆర్థిక భరోసాగా ఉండేదని, ప్రస్తుతం పరిహారం అందక బాధిత కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కొత్త పథకాలను అమలు చేస్తున్నప్పటికీ, ఇప్పటికే రైతు కుటుంబాలకు అండగా ఉన్న రైతు బీమా వంటి కీలక పథకాల చెల్లింపులను పెండింగ్లో పెట్టడం సరికాదని మల్లికార్జున రెడ్డి అన్నారు. రైతు కుటుంబాలకు భరోసా కల్పించాలంటే రైతు బీమా పథకాన్ని కొనసాగించాలని, ఆగస్టు నుంచి మరణించిన రైతుల కుటుంబాలకు రావాల్సిన పరిహారాన్ని తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పణలో తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకుడు బత్తుల కొమురయ్య పాల్గొన్నారు.