భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని తెలంగాణ బీసీ ఐక్యవేదిక కన్వీనర్ మార్క అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. బడుగు, బలహీన వర్గాల విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే వర్ధంతి సందర్భంగా శనివారం హుస్నాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల గురుకుల పాఠశాలలో మార్క అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా విద్య, కులవివక్ష నిర్మూలన, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జ్యోతిబా ఫూలే తన జీవితమంతా పోరాటం చేశారని గుర్తుచేశారు. తన సతీమణి సావిత్రిబాయి ఫూలేతో కలిసి బాలికల విద్య కోసం పాఠశాలలను ప్రారంభించి విద్యా విప్లవానికి నాంది పలికారని కొనియాడారు. విద్య ద్వారానే సమాజంలోని అజ్ఞానం, అసమానతలను తొలగించవచ్చని ఫూలే బలంగా విశ్వసించారని తెలిపారు.
విద్యాభివృద్ధికి ప్రభుత్వ కృషి
ఫూలే ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం BС, SC, ST, మైనారిటీ వర్గాల విద్యాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తోందని మార్క అనిల్ కుమార్ గౌడ్ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెనుకబడిన వర్గాలకు మెరుగైన విద్యావకాశాలు కల్పించడంతో పాటు వారి అభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల శిక్షణ అందించడం, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, మెరుగైన వసతులు కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు.
విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం
హుస్నాబాద్ నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాలను మరింత బలోపేతం చేసేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి అవకాశాలు, నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలని ఆకాంక్షించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థీ చదువుకు దూరం కాకూడదని, ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన వైద్యం అందాలని పేర్కొన్నారు.
ఫూలే ఆశయాలను జయంతి, వర్ధంతి కార్యక్రమాలకే పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరూ ఆయన చూపిన విద్యా మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాలన్నింటికీ సమాన అవకాశాలు, విద్య, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం అందినప్పుడే మహాత్మా జ్యోతిబా ఫూలే కలలుగన్న సమాజం ఏర్పడుతుందని అన్నారు.
ప్రముఖుల హాజరు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, గ్రంథాలయ మాజీ చైర్మన్ కే. లింగమూర్తి, హుస్నాబాద్ JAC చైర్మన్ కవల లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ డ్యాగల సారయ్య, పాఠశాల ప్రిన్సిపల్ వీణ చందన, ఉపసర్పంచ్ బొమ్మగాని రాజ్‌కుమార్, బీసీ సంఘం నాయకులు చిత్తారి రవీందర్, మాజీ సర్పంచ్ బత్తిని సాయిలు, మాజీ ఎంపీటీసీ బొమ్మగాని హరిబాబు, గట్టు రాములు, పోతుగంటి బాలయ్య, సంగ కుమార్, వొగ్గోజు ఈశ్వర్, నాంపల్లి సమ్మయ్య, కొండపర్తి నగేష్, ఇంతియాజ్, రాగి శ్రీనివాస్, ఇజ్జగిరి అనిల్, ప్రశాంత్‌తో పాటు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.