భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

దీక్షా దివస్ సభకు హుస్నాబాద్ నుంచి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు

దీక్షా దివస్‌కు హుస్నాబాద్‌నుంచి భారీగా తరలింపు తెలంగాణ ఉద్యమ చరిత్రనుభావితరాలకు తెలియజేయడమే లక్ష్యం

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష, ఉద్యమకారుల త్యాగాలు, ప్రజా పోరాటాల చరిత్రను భావితరాలకు తెలియజేయడమే దీక్షా దివస్ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. నవంబర్ 29న కరీంనగర్‌లో నిర్వహించనున్న దీక్షా దివస్ బహిరంగ సభకు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

ఈ మేరకు శనివారం హుస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంథని మాజీ ఎమ్మెల్యే, దీక్షా దివస్ కార్యక్రమ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్ట మధు, కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల సతీష్‌కుమార్ మాట్లాడారు.

దీక్షా దివస్‌కు హుస్నాబాద్‌నుంచి భారీగా తరలింపు తెలంగాణ ఉద్యమ చరిత్రనుభావితరాలకు తెలియజేయడమే లక్ష్యం

ఉద్యమ చరిత్రను భావితరాలకు చాటాలి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జన్మించిన నేటి యువతకు ప్రత్యేక రాష్ట్ర సాధన వెనుక ఉన్న పోరాటాలు, కేసీఆర్ చేసిన త్యాగాలను వివరించాల్సిన అవసరం ఉందని పుట్ట మధు అన్నారు. 2009 నవంబర్ 29న 'సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో' అనే నినాదంతో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని గుర్తుచేశారు. చరిత్రను తెలుసుకోనివారు చరిత్రను సృష్టించలేరని, తెలంగాణ ఉద్యమంలో జరిగిన కీలక ఘట్టాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో దీక్షా దివస్ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

కేసీఆర్ దీక్షతో ఉద్యమానికి కీలక మలుపు

దీక్షా దివస్‌కు హుస్నాబాద్‌నుంచి భారీగా తరలింపు తెలంగాణ ఉద్యమ చరిత్రనుభావితరాలకు తెలియజేయడమే లక్ష్యం

హైదరాబాద్‌లో ఉద్యోగ నియామకాల ఫ్రీజోన్ వివాదం తెలంగాణ యువతలో తీవ్ర ఆందోళనకు కారణమైందని బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కేసీఆర్ భావించి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారని చెప్పారు.

కేసీఆర్ దీక్ష నేపథ్యంలో డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారని గుర్తుచేశారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో తెలంగాణ రాజకీయ జేఏసీ ఏర్పాటై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిందన్నారు. సకల జనుల సమ్మె, రైల్వే నిరసనలు, మిలియన్ మార్చ్ వంటి కార్యక్రమాలతో ప్రజలు పెద్దఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. ప్రజా పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు.

14 వేల మందికి పైగా తరలింపు

దీక్షా దివస్‌కు హుస్నాబాద్‌నుంచి భారీగా తరలింపు తెలంగాణ ఉద్యమ చరిత్రనుభావితరాలకు తెలియజేయడమే లక్ష్యం

దీక్షా దివస్ బహిరంగ సభకు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి 14 వేల మందికి పైగా తరలివెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామని వొడితల సతీష్‌కుమార్ తెలిపారు. గత పది రోజులుగా పార్టీ నాయకులతో చర్చలు జరిపి, మండలాల వారీగా, పార్టీ కేడర్ వారీగా సమావేశాలు నిర్వహించి జనసమీకరణపై ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.

హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి 204 బస్సులు, 183 ట్రాక్స్ ఆటోలు, 14 వ్యాన్లతో పాటు ఇతర వాహనాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కరీంనగర్ సభకు వెళ్లనున్నట్లు వివరించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని అన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. దీక్షా దివస్ సభలో కేటీఆర్ ప్రసంగాన్ని వినేందుకు పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని తెలిపారు.

రవాణా, పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు

దీక్షా దివస్‌కు హుస్నాబాద్‌నుంచి భారీగా తరలింపు తెలంగాణ ఉద్యమ చరిత్రనుభావితరాలకు తెలియజేయడమే లక్ష్యం

సభకు తరలివచ్చే ప్రజలకు రవాణా, పార్కింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు వొడితల సతీష్‌కుమార్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమై 5 గంటల నుంచి 5.30 గంటల మధ్య ముగిసేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. సభ ముగిసిన వెంటనే తిరుగు ప్రయాణం ప్రారంభించి అందరూ తమ గ్రామాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో హుస్నాబాద్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పెరుక భాగ్యరెడ్డి, కౌన్సిలర్లు గాదెపాక రవీందర్, వాల సుప్రజ, బొల్లి శ్రీనివాస్, గడిపే సంపత్, రాష్ట్ర నాయకుడు పేర్యాల రవీందర్‌రావు, మాజీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.