భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని మండల వ్యవసాయ అధికారిణి దీపిక సూచించారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని తుజాల్పూర్, తిరుమలాపూర్, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో ఎల్‌నినో ప్రభావాలు, నీటి సంరక్షణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు రైతులకు పలు సూచనలు చేశారు.
వ్యవసాయ అధికారిణి దీపిక మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. వర్షపాతం తగ్గే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఒకే రకమైన పంటపై ఆధారపడకుండా నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు.
ముఖ్యంగా తక్కువ నీటి వినియోగంతో సాగు చేసుకునే జొన్న, మొక్కజొన్న, పెసర, అలసంద, మినుము, శనగ, నువ్వులు, కుసుమ, పొద్దుతిరుగుడు, ఆవాలు, కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వరి సాగును తగ్గించడంతో పాటు నీటి వినియోగాన్ని తగ్గించే జీరో ప్యాడీ విధానాన్ని ప్రోత్సహించాలని కోరారు.
అలాగే ఆయిల్‌పామ్ సాగుతో కలిగే ప్రయోజనాలు, సూక్ష్మ నీటిపారుదల పద్ధతులు, నీటి పొదుపు మార్గాలపై రైతులకు వివరించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను వృథా చేయకుండా అవసరాలకు అనుగుణంగా సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకొని సాగు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తూ తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందే స్థిరమైన వ్యవసాయ పద్ధతులను రైతులు అలవర్చుకోవాలని దీపిక కోరారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు చేసుకుంటే సాగు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు పంటల దిగుబడిని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీఓ మహమ్మద్ మొజామ్ హుస్సేన్, HEO గోవింద్, AEO దుర్గాప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.