భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

సిరిపురంలో ధ్యానం కొనుగోలు కోసం రైతుల ధర్నా, రాస్తారోకో

సిరిపురంలో ధ్యానం కొనుగోలు కోసం రైతుల ధర్నా రాస్తారోకో

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ హత్నూర మండలం సిరిపుర గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు నిలిచిపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురుచూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తేమశాతం నిబంధనల పేరుతో అధికారులు ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం లేదని, దీంతో పదేపదే ధాన్యాన్ని ఆరబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాపోయారు. కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

మరోవైపు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడంతో దళారులు ఇదే అదునుగా భావిస్తున్నారని రైతులు ఆరోపించారు. తక్కువ ధరలకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ తమను నష్టాలపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ తమ పంటను విక్రయించుకోలేని పరిస్థితి నెలకొందని అన్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత వ్యవసాయ, కొనుగోలు శాఖల అధికారులు స్పందించాలని రైతులు డిమాండ్ చేశారు. సిరిపుర ధాన్యం కొనుగోలు కేంద్రంలో వెంటనే కొనుగోళ్లు ప్రారంభించి తమకు న్యాయం చేయాలని కోరారు. పంటను అమ్ముకునేందుకు రోజుల తరబడి వేచి చూసే పరిస్థితిని తొలగించి, కొనుగోళ్లలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై శ్రీధర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్ల విషయంలో రైతుల ఆవేదనను విన్న ఆయన వారికి నచ్చజెప్పడంతో రైతులు ధర్నా, రాస్తారోకోను విరమించారు. అయినప్పటికీ ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని సిరిపుర రైతులు కోరుతున్నారు.