భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ఉమ్మడి మెదక్ జిల్లాలో 108 అంబులెన్స్ సిబ్బందికి నిర్వహించిన రిఫ్రెషర్ శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతోపాటు, ప్రమాదాలు, ఇతర ఎమర్జెన్సీ ఘటనల్లో వేగంగా స్పందించేలా సిబ్బందికి అవసరమైన నైపుణ్యాలను అందించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ బయ్యా తెలిపారు.
గత సోమవారం ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు (EMTలు), అంబులెన్స్ పైలట్లు పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు ప్రీ హాస్పిటల్ వైద్య సేవలు ఎలా అందించాలి, ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై సిబ్బందికి వివరించారు. బాధితులకు ఆసుపత్రికి చేరకముందే అందించాల్సిన ప్రాథమిక వైద్య సేవలపై అవగాహన కల్పించారు.
అత్యవసర ఘటనలు జరిగినప్పుడు సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలించడంతోపాటు, పరిస్థితికి అనుగుణంగా సమర్థవంతంగా స్పందించాలని తెలిపారు. అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన వైద్యపరమైన మెలకువలు, బాధితుల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ బయ్యా మాట్లాడుతూ.. 108 అంబులెన్స్ సేవల్లో పనిచేసే సిబ్బంది ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలిపారు. బాధితులకు నాణ్యమైన ప్రీ హాస్పిటల్ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఇలాంటి రిఫ్రెషర్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా 108 కోఆర్డినేటర్ నవీన్ కుమార్, EMLC ఇన్స్ట్రక్టర్ అరుణ్, సిద్దిపేట జిల్లా మెడికల్ టెక్నీషియన్లు, అంబులెన్స్ పైలట్లు పాల్గొన్నారు. హుస్నాబాద్ 108 అంబులెన్స్ సిబ్బందితోపాటు సిద్దిపేట జిల్లా పరిధిలోని ఇతర సిబ్బంది కూడా ఈ శిక్షణ తరగతులకు హాజరయ్యారు.