భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నిషేధిత గుడుంబా తయారీ, విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నెల్లికుదురు మండలం బడితండాలో శనివారం నిర్వహించిన కార్డెన్ సెర్చ్‌లో గుడుంబా తయారీ స్థావరాలను గుర్తించి, 60 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే తయారీకి ఉపయోగించే 500 లీటర్ల నల్లబెల్లం, పటిక పానకాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంలో గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న ఆరుగురిపై కేసులు నమోదు చేశారు.
కేసముద్రం సర్కిల్ CI వై. సత్యనారాయణ నేతృత్వంలో ఈ ప్రత్యేక తనిఖీలు జరిగాయి. నెల్లికుదురు SI గంగారపు కరుణాకర్, ఇనుగుర్తి SI పి. నరేష్, కేసముద్రం SI క్రాంతి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బడితండాలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుడుంబా తయారీకి సంబంధించిన స్థావరాలను గుర్తించి, అక్కడ ఉన్న ముడిసరుకును ధ్వంసం చేశారు. తయారు చేసిన 60 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టారు.
గుడుంబాతో ఆరోగ్యం పాడుచేసుకోవద్దు: CI
నిషేధిత గుడుంబా సేవించి ప్రజలు తమ ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని CI సత్యనారాయణ తండావాసులకు సూచించారు. గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుడుంబా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, పటికలను అక్రమంగా విక్రయించే వ్యాపారులపైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
గ్రామాల్లో, పరిసర ప్రాంతాల్లో గుడుంబా తయారీ, విక్రయాలు జరుగుతున్నా, నల్లబెల్లం, పటికలను అక్రమంగా రవాణా చేస్తున్నా లేదా విక్రయిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చేవారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. నిషేధిత గుడుంబా తయారీ, విక్రయాలను అరికట్టేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.