భారత్ సమాచార్.నెట్: దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. వర్షపు నీటి సంరక్షణలో దేశంలోనే అగ్రస్థానం దక్కించుకుంది తెలంగాణ. దేశ వ్యాప్తంగా చేపట్టిన వర్షపు నీటి సంరక్షణ పనుల్లో తెలంగాణ ఈ ఘనతను సాధించినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ప్రకటించింది. జల్ సంచయ్-జన్ భాగీదారీ 1.0 ర్యాంకింగ్స్ ప్రకారం తెలంగాణ అగ్రస్థానంలో నిలవగా.. ఛత్తీస్గఢ్, రాజస్థాన్ వరుసగా రెండు, మూడవ స్థానంలో నిలిచాయి.
దేశవ్యాప్తంగా వాన నీటి సంరక్షణ, వృథా నివారణ, పొదుపు, ఇంకుడు గుంతలు, ఇతర నిర్మాణాల ద్వారా వృథా నీటి నిల్వ, నీటి వనరులను కాపాడటం కోసం కేంద్ర ప్రభుత్వం గతేడాది ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 2024-25లో రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షలకు పైగా చెక్ డ్యామ్లు, ఇంకుడు గుంతలు, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్, పొలాల్లో నీటికుంటలు, ఊట చెరువులు సహా ఇతర వర్షపు నీటి సంరక్షణ పనులు చేపట్టారు. ఈ పనుల్లో ఉపాధి హామీ పథకాలు, జాతర కార్యక్రమాలు తదితర వాటికి ప్రాధాన్యత కల్పించడంతో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది.
జల్ సంచయ్-జన్ భాగీదారీ 1.0 లో దేశవ్యాప్తంగా 67 జిల్లాలు ఎంపిక కాగా.. తెలంగాణ అగ్రస్థానంలో నిలవడమే కాక.. ఎనిమిది జిల్లాలు ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాయి. రూ. 2 కోట్ల నగదు బహుమతి విభాగంలో ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల, రూ. 1 కోటి నగదు బహుమతి విభాగంలో వరంగల్, నిర్మల్, జనగామ, రూ. 25 లక్షల నగదు బహుమతి విభాగంలో: భద్రాద్రి, మహబూబ్ నగర్ జిల్లాలు ఎంపికయ్యాయి. ఈ విధంగా ఈ కార్యక్రమంలోనే దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది.