భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: డబ్బులతో మూడిపడిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రవేశపెట్టగా.. ఆ బిల్లుకు పార్లమెంట్ సభ్యులు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు చట్ట రూపం దాల్చడంతో.. ఆన్‌లైన్ గేమింగ్ ప్రోత్సాహం, నియంత్రణ చట్టం- 2025 అమలులో భాగంగా తాజాగా ముసాయిదా నిబంధనలు విడుదల చేసింది కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.
ఈ ముసాయిదాపై ప్రజలు ఈ నెలాఖరు వరకు అభిప్రాయాలు తెలియజేయాలని మంత్రిత్వ శాఖ కోరింది. ముసాయిదా నిబంధనల్లో గేమ్స్‌ను ఎలా వర్గీకరించాలి, రిజిస్ట్రేషన్ ఎలా జరగాలి అన్నదానిపై పూర్తి వివరాలు తెలిపింది కేంద్రం. అనుమతించదగిన గేమ్స్‌కి ప్రోత్సాహం ఇవ్వడం.. వాటి పర్యవేక్షణ చేసే ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అధికారాలు, బాధ్యతలను కూడా వివరించారు. దేశంలో ప్రత్యేకంగా ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీని నియంత్రణ సంస్థగా ఏర్పాటు చేయాలని ముసాయిదా ప్రతిపాదిస్తోంది.
ఇందులో ఒక చైర్మన్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన మరో ఐదుగురు సభ్యులు ఉంటారు. గేమ్ “మనీ గేమ్” కింద వస్తుందా లేదా అన్నది నిర్ణయించడం, రిజిస్ట్రేషన్ ఇవ్వడం, మార్గదర్శకాలు జారీ చేయడం, నిబంధనల ఉల్లంఘనపై శిక్షలు విధించడం వంటి అధికారాలు ఈ సంస్థకు ఉంటాయి. ఆన్‌లైన్ గేమ్స్‌లో చట్టవిరుద్ధ చర్యలకు అవకాశం కల్పిస్తే అది జామీను లేని నేరంగా పరిగణించబడుతుందని ముసాయిదా స్పష్టం చేసింది.