భారత్ సమాచార్.నెట్: ప్రముఖ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన కరూర్ తొక్కిసలాట ఘటనపై నటి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఉద్దేశపూర్వకంగా కొందరు సృష్టించారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని స్పష్టంగా కనిపిస్తోందని.. సరైన ర్యాలీ స్థలం ఇవ్వకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు.
ఈ తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారని ఆమె గుర్తుచేశారు. దీనిపై మౌనంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు ఖుష్బూ. ఘటన సమయంలో పోలీసులు ఎందుకు లాఠీ ఛార్జ్ చేశారని ఆమె ప్రశ్నించారు. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోలు చాల బయటకు వచ్చాయని.. ఈ ఘటన వెనుక పక్కా ప్రణాళికతో కుట్ర ఉందని తాను నమ్ముతున్నట్లు ఖుష్బూ వ్యాఖ్యానించారు.
కాగా సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. విజయ్ ర్యాలీకి ఎంతమంది జనం వస్తారో తెలిసి కూడా డీఎంకే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాజకీయ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ఈ ఘటన దర్యాప్తులో భాగంగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.