భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: దసరా సెలవులు ముగియడంతో సొంతూళ్ల నుంచి హైదరాబాద్‌కు తిరిగొస్తున్నారు జనం. ఆదివారం సాయంత్రం నుంచే నగరానికి జనం క్యూ కట్టగా.. ఆ రద్దీ ఇప్పటికి కొనసాగుతోంది. దీంతో టోల్ గేట్లు, బస్ స్టాండ్లు, మెట్రో రైల్వే స్టేషన్లు అన్ని జనంతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ జనంతతో కిక్కిరిసిపోయింది. ప్రయాణికులు పెద్ద ఎత్తున రావడంతో ఎల్బీనగర్ ప్రాంతం జనజాతరగా మారింది.
ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో.. వాహనాలు కదలడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రయాణికుల రద్దీతో మెట్రో సిబ్బంది వారిని క్యూ పద్దతిలో వారిని ప్రవేశపెడుతున్నారు. భారీ రద్దీ కారణంగా క్యూ లైన్‌లో నిలబడి ప్లాట్ ఫాంపై చేరడానికి రెండు గంటల సమయం పడుతుండటంతో.. ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం రద్దీగా ఉండే ఎల్బీనగర్ స్టేషన్ పండుగ సెలవుల అనంతరం మరింత రద్దీగా మారింది. ఈ రద్దీని నియంత్రించేందుకు మెట్రో సిబ్బందికి కూడా కష్టంగా మారింది. మరోవైపు విజయవాడ-హైదరాబాద్ ఎన్హెచ్‌పై కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాల ప్రాంతం నుండి పెద్దకాపర్తి వరకు వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి టోల్‌ప్లాజా సహా చౌటుప్పల్, దండు మల్కాపురం వంటి ప్రాంతాల్లో కూడా వాహనలు బారులు తీరాయి.