భారత్ సమాచార్.నెట్: బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణలో ఖాళీగా ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 13వ తేదీన నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. అదే రోజే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని.. ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు పేర్కొంది.
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గెలుపొందగా.. ఈ ఏడాది జూన్‌లో ఆయన గుండెపోటుతో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ.. గోపీనాథ్ సతీమణి సునీతా గోపీనాథ్‌కు టికెట్‌ను కేటాయించింది. కాగా, నవంబర్ 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. 14న కౌంటింగ్, ఫలితాలను ప్రకటించనున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ సీటుపై అభ్యర్థులుగా నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సి.ఎన్. రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. కానీ వీరిలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ సర్కార్ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరిని త్వరలోనే ఖరారు చేసే అవకాశం ఉంది.