భారత్ సమాచార్, ములుగు జిల్లా: వెంకటాపురం మండలం బుధవారం సాయంత్రం ఉప్పేడు గోల్లగూడెం ప్రధాన రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇసుక క్యారీ వద్దకు వెళ్తున్న లారీల వల్ల వాహనాలు గంటల తరబడి కదలలేని పరిస్థితి నెలకొంది.సమీప ప్రాంతాల నుంచి ఇసుక రవాణా కోసం వెళ్తున్న డజన్ల కొద్దీ లారీలు రహదారి పై ఒక్కసారిగా కదలడంతో తీవ్ర రద్దీ ఏర్పడింది. దీనివల్ల స్కూల్ బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రతి రోజూ ఇదే పరిస్థితి ఎదురవుతోందని తెలిపారు. ఈ లారీలు రోడ్లను అడ్డగించడంతో పాటు దుమ్ము, శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.పాదచారులు, విద్యార్థులు జాగ్రత్తగా రహదారి అంచుల వెంట నడుస్తూ తమ గమ్యస్థానాలకు చేరుకునే ప్రయత్నం చేశారు. వృద్ధులు, అత్యవసర వాహనాలు కూడా ఈ ట్రాఫిక్ జామ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. స్థానిక ప్రజలు అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇసుక లారీ రవాణాను నియంత్రించాలని కోరుతున్నారు.లారీ రవాణా సమయాలను నియంత్రించి, జనసాంద్రత గల ప్రాంతాల నుండి భారీవాహనాలను మళ్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని కథనాలు:
వనదేవతలకు డిజిటల్ హుండీ