భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, నవంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

ఇళ్ల స్థలాల మంజూరుకు చర్యలు తీసుకోవాలి: రాజకుమారి గణియా

c3aee864-7778-4856-84d3-423702e85e92

భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హౌసింగ్ కొత్త స్కీమ్‌పై ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలాల మంజూరుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తహసిల్దార్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తహసిల్దార్లతో రెవెన్యూ సంబంధిత అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హౌసింగ్ కొత్త విధానాల ప్రకారం రూరల్ పరిధిలో లబ్ధిదారులకు 3 సెంట్లు, అర్బన్ పరిధిలో 2 సెంట్లు ఇంటి స్థలం కేటాయించనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు సచివాలయాలలో ఇంటి స్థలాలకు ఆన్లైన్‌గా దరఖాస్తు చేసుకునేలా వారికి పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.

పీజీఆర్ఎస్ దరఖాస్తులపై కఠిన ఆదేశాలు:
ప్రతి సోమవారం తహసిల్దార్ కార్యాలయంలో జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే అర్జీలను వెంటనే ఆన్లైన్ చేసి, రసీదులు ఇవ్వాలని ఆదేశించారు. అర్జీలు ఆన్లైన్ చేయకపోవడం వల్ల బాధితులు జిల్లా కేంద్రాలకు రావాల్సిన పరిస్థితి వస్తోందని, ఇక నుంచి ఈ నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు.

భూ సమస్యల పరిష్కారంపై దృష్టి:
పట్టా భూములను 22ఏలో చేర్చడం అనుమతించరాదని, అలాంటి ఘటనలు ఎక్కడైనా ఉంటే వెంటనే సరిదిద్దాలని ఆమె స్పష్టం చేశారు. ఈ-సైన్‌తో ఫైళ్ల సమర్పణ తప్పనిసరి అని సూచించారు. ఇకపై అన్ని కార్యాలయాల నుంచి పంపే ఫైళ్లను సంబంధిత అధికారుల ఈ-సైన్‌తో ఈ ఆఫీస్‌ ద్వారా మాత్రమే సమర్పించాలని తహసిల్దార్లకు ఆదేశించారు. జిల్లా ర్యాంకింగ్ కూడా ఫైళ్ల ప్రాసెసింగ్, ఫిర్యాదుల పరిష్కారం ఆధారంగా నిర్ణయించబడుతుందని తెలిపారు. జిల్లాలో శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలకు వచ్చిన దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి, అర్హులందరికీ సకాలంలో సర్టిఫికెట్లు జారీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, ఆర్డీవోలు, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.