భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జి.కబర్థి సూచనల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి పురుషుల జిల్లా కారాగారం, మహిళా కారాగారాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ ను పరిశీలించి జైలు ఖైదీలకు అందించే న్యాయ సేవల గురించి వివరించారు. ఈ క్లినిక్స్‌లో ఒక న్యాయవాది, ఒక ప్యారా లీగల్ వాలంటీర్ ఉంటారని, వారు ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తారని తెలిపారు. అంతేకాకుండా సత్ప్రవర్తనతో శిక్షను పూర్తి చేయాలని ఖైదీలను ప్రోత్సహించారు. న్యాయవాది లేని ఖైదీలకు ఉచిత న్యాయవాదిని నియమిస్తామన్నారు. 70 సంవత్సరాల పైబడిన ఖైదీలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తక్షణ బెయిల్ కోసం కృషి చేస్తామని తెలిపారు. తనిఖీ సమయంలో ఖైదీలకు అందించే ఆహారం, రేషన్, ఆరోగ్య పరిరక్షణ చర్యలను కూడా పరిశీలించారు. అలాగే ఖైదీలు కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరు కావాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని తెలిపారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ నంబర్ 15100 పై అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జైలు అధికారులు, లీగల్ ఎయిడ్ న్యాయవాది శివరాం, ఖైదీలు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
21, నవంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్