భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, సెప్టెంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

నెల్లికుదురులో కరెంట్ కోసం బీఆర్ఎస్ ధర్నా

WhatsApp Image 2026-09-05 at 8.18.33 PM

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: విద్యుత్ కోతలను వెంటనే ఎత్తివేసి ప్రజలకు, రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లికుదురు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్‌ఎస్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై శనివారం నెల్లికుదురులో నిర్వహించిన సమరభేరి సభలో మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడుతున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొంతసేపు నిరీక్షించినా విద్యుత్ పునరుద్ధరణ కాకపోవడంతో సభను ముగించారు.

అనంతరం మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎంపీ మాలోత్ కవిత బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి విద్యుత్ సబ్‌స్టేషన్‌ వరకు ప్రదర్శనగా వెళ్లారు. కరెంటు కోతలను వెంటనే ఎత్తివేయాలని నినాదాలు చేస్తూ సబ్‌స్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ కరుణాకర్‌తో పాటు పోలీసులు గేటు వద్ద వారిని అడ్డుకున్నారు. దీంతో నాయకులు అక్కడే ఆందోళన చేపట్టి విద్యుత్ శాఖ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శంకర్ నాయక్, మాలోత్ కవిత మాట్లాడుతూ విద్యుత్ కోతల కారణంగా రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను వెంటనే పరిష్కరించి ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. సమస్య పరిష్కరించకపోతే మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో విద్యుత్ కోతలు విధించలేదని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెన్నాకుల శ్రీను, శ్రీనివాస్‌రెడ్డి, బత్తిని అనిల్, నవీన్‌రావు, వీరగాని మల్లేశం గౌడ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యుత్ కోతల సమస్యను వెంటనే పరిష్కరించి రైతులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు.