భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సంబరాలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, మాజీ ఎంపీ మాలోత్ కవిత తీవ్ర విమర్శలు చేశారు. నెల్లికుదురు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో విఫలమైన అంశాలను నిరసిస్తూ సమరభేరి కార్యక్రమం నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ తదితర సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి బీఆర్ఎస్లో చేరిన పలువురికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏం ఒరగ పెట్టారని సంబరాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో విఫలమైందని ఆరోపించారు. విద్యార్థులకు భరోసా కార్డులు, ఆడపిల్లలకు స్కూటీలు, రెండు లక్షల ఉద్యోగాలు వంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా నయవంచన చేసిందని ఆరోపించారు. విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పరిపాటి వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెన్నకుల శ్రీను, మాజీ జెడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్‌రావు, భోజ్య నాయక్, బత్తిని అనిల్ గౌడ్, యాసం రమేష్, ఎడ్ల మహేష్, పులి రామచంద్రు, భీముడు, అశ్విన్, రెహమాన్, నవీన్‌రావు, అశోక్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.