భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బైక్‌పై వెళ్తున్న వారిని ఢీకొట్టి ప్రమాదానికి కారణమైన అనంతరం తప్పించుకుని తిరుగుతున్న కారును పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పట్టుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రమాదానికి కారణమైన కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఎస్సై కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 24న నెల్లికుదురు మండలం రాజుల కొత్తపల్లి గ్రామానికి చెందిన తూల్ల శ్రీధర్, గడ్డమీది వెంకన్న, ఆయన కుమార్తె స్వప్న బైక్‌పై తొర్రూరు నుంచి రాజుల కొత్తపల్లికి వస్తున్నారు. ఈ క్రమంలో నెల్లికుదురు వైపు నుంచి వస్తున్న కారు వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వారికి గాయాలయ్యాయి.
ఈ ఘటనపై బాధితుడు తూల్ల శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు నంబర్ టీఎస్-09-ఈ-2056 ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కారును గుర్తించిన పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు.
కాగా.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బుర్హాన్‌పల్లి గ్రామానికి చెందిన కారు డ్రైవర్ బానోతు సతీష్ దొంగ నంబర్ ప్లేట్‌ను బిగించుకుని కారుతో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎస్సై కరుణాకర్ చాకచక్యంగా వ్యవహరించి సతీష్‌ను అదుపులోకి తీసుకుని, ప్రమాదానికి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.